Jagan: ఎవరు చెబితే పోలవరం పనులను ఆపేశారు?: దేవినేని ఉమ
- పోలవరం ప్రాజెక్టును ఎందుకు ఆపారో ప్రజలకు చెప్పాలి
- పనులు ఆగడం వల్ల 27 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న ఉమ
- జగన్ పాలనంతా తప్పుల తడకేనన్న కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు ఆపారో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు ఆగిపోవడం వల్ల 27 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి సలహాలతో సీఎం జగన్ ఇవన్నీ చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం బాధితులను ఎవరు ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి దేవినేని మీడియాతో మాట్లాడుతూ, ఈ మేరకు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల వేలాది మంది కార్మికులు పనులను కోల్పోయారని ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ 100 రోజుల పాలన అంతా తప్పుల తడకేనని విమర్శించారు. సొంతవారికి దోచిపెట్టేందుకే కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రజలపై మరింత భారం మోపే విధంగా ప్రభుత్వ తీరు ఉందని చెప్పారు.