Narendra Modi: 130 కోట్ల మంది భారతీయులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి: మోదీ
- రేపు చంద్రుడిపై చంద్రయాన్-2 ల్యాండింగ్
- ట్విట్టర్ లో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
- ఉద్విగ్నత ఆపుకోలేకపోతున్నానంటూ వ్యాఖ్యలు
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 సెప్టెంబరు 7న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. 130 కోట్ల మంది భారతీయులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్నది ఈ మధుర క్షణాల కోసమేనని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. మరికొన్ని గంటల్లోనే చంద్రయాన్-2 ప్రయోగంలో ఆఖరి అంకానికి తెరలేవనుందని, తద్వారా భారత్ తో పాటు తక్కిన ప్రపంచం కూడా ఇస్రో శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని మరోసారి చూస్తుందని పేర్కొన్నారు.
"బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి ఈ ప్రక్రియను వీక్షించడానికి ఎంతో ఉద్విగ్నతకు గురవుతున్నాను. భారత అంతరిక్ష చరిత్రలోనే అసాధారణ ఘట్టం ఇది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుర్రాళ్లు కూడా ఈ ప్రత్యేక క్షణాలను ఆస్వాదించనున్నారు. మిత్రదేశం భూటాన్ కు చెందిన యువతీయువకులు కూడా ఈ ఘట్టాన్ని వీక్షిస్తారు. చంద్రయాన్-2 నింగికెగసిన జూలై 22వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఈ ప్రయోగం భారత్ లో ఉన్న అత్యుత్తమ నైపుణ్యానికి, ఉక్కు సంకల్పానికి ప్రతిరూపం. ఈ విజయంతో కోట్లాది భారతీయులకు లబ్ది చేకూరనుంది" అంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు.