Etala: పోలీసులకు డెంగీ జ్వరాలు... మంత్రి ఈటల కీలక ఆదేశాలు
- అన్ని పీఎస్ ల వద్ద పాత వాహనాలు తొలగించాలని ఆదేశించాం
- పీఎస్ లలో పరిశుభ్రతపై డీజీపీతో చర్చించాం
- ఫీవర్ ఆసుపత్రిలో 62 మందికి డెంగీ ఉన్నట్టు తేలింది
తెలంగాణలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. పోలీసులు సైతం ఈ వ్యాధి బారిన పడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ... పోలీస్ స్టేషన్ల వద్ద ఉన్న పాత వాహనాలు దోమలకు నెలవు అవుతున్నందున వాటిని వెంటనే తొలగించాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. వాహనాల తరలింపు, పోలీస్ స్టేషన్ల ప్రాంగణాల్లో పరిశుభ్రతపై డీజీపీతో చర్చించామని చెప్పారు. రాష్ట్రంలో విష జ్వరాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
హైదరాబాదులోని ఫీవర్ ఆసుపత్రిలో 62 మందికి డెంగీ జ్వరం ఉన్నట్టు తేలిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాయంత్రం పూట కూడా ఓపీ సేవలను నడుపుతున్నామని తెలిపారు. సెలవులు తీసుకోకుండా వైద్యులు పని చేస్తున్నారని వెల్లడించారు. మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక స్వైన్ ఫ్లూ కేసు నమోదైందని చెప్పారు. మరోవైపు, స్థలం లేకపోవడంతో వాహనాలను తరలించలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు.