Jagan: సార్... అమ్మ ఒడి పథకానికి మీకు స్ఫూర్తినిచ్చెందెవరు? ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేసింది?: జగన్ ను ప్రశ్నించిన విద్యార్థిని
- శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన
- విద్యార్థులతో సీఎం ముఖాముఖి
- అమ్మ ఒడిపై వివరించిన జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. ఎచ్చెర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్య అనే బాలిక జగన్ ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.
"సార్, అమ్మ ఒడి పథకానికి మీకు స్ఫూర్తినిచ్చిందెవరు? ఏ అంశం మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిందని ప్రశ్నించింది. దీనికి సీఎం జగన్, చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లీ అంటూ స్పందించారు. అనంతరం జవాబిస్తూ, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగానే కాకుండా, పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలను దగ్గరగా చూశానని తెలిపారు. బహుశా తాను చేసినట్టుగా దేశంలో ఏ కొద్దిమందో మాత్రమే పాదయాత్ర చేసి ఉంటారని చెప్పారు.
"ఓదార్పుయాత్ర అయితేనేమీ, పాదయాత్ర అయితేనేమీ చాలామంది పేదల ఇళ్లకు వెళ్లాను. తమ పిల్లలను చదివించాలని చాలామంది తల్లులకు ఆరాటం ఉంటుంది. కానీ చదివించలేని స్తొమత వారిది. మనమేదైనా మన పిల్లలకు, తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే. విద్య ద్వారానే ఓ పేదవాడు దారిద్ర్యరేఖకు దిగువ నుంచి ఉన్నతస్థాయికి ఎదగగలడు. ఓ పేదకుటుంబం నుంచి ఒక్కరన్నా బాగా చదివి డాక్టరో, ఇంజినీరో అయితేనే వారి పరిస్థితి మారిపోతోంది. ఇది నేను గట్టిగా నమ్మాను. అందుకే ప్రతి తల్లి తన బిడ్డలను ప్రయోజకుల్ని చేయాలన్న సదుద్దేశంతో అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశాం" అంటూ సీఎం జగన్ వివరణ ఇచ్చారు.