Mamatha Banarjee: అందరి దృష్టి మరల్చేందుకే చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించారు: తీవ్ర వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ
- రాజకీయ మైలేజి కోసం పాకులాడుతున్నారంటూ విమర్శలు
- ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టాలంటూ హితవు
- చిదంబరం పరిస్థితిపైనా వ్యాఖ్యలు చేసిన దీదీ
యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా చంద్రయాన్-2 ల్యాండింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి అందరి దృష్టి మరల్చేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగానే చంద్రయాన్-2 చేపట్టారని ఆరోపించారు.
ఇలాంటి ప్రయాసతో కూడుకున్న ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు నిర్వహించనట్టు, తామే ఇంతటి ఘనతర ప్రాజెక్టులను చేపడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని, చంద్రయాన్ వంటి భారీ ప్రాజెక్టులను నిర్వహించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ మైలేజీ కోసం పాకులాడే బదులు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడితే బాగుండేదని వ్యాఖ్యానించారు. పాలనకు బదులు రాజకీయ ప్రతీకారంపైనే శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శించారు.
"ఉన్నట్టుండి రాజకీయ నేతలందరూ దొంగలుగా మారిపోయారు. చిదంబరం అంతటివాడ్ని తీహార్ జైలుకు పంపారు. ఏం జరగబోతోంది? ఈ పరిణామాలపై విపక్షాలు ఏకం కాకపోవడం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. చిదంబరం నిజంగానే నిందితుడో కాదో మనకు తెలియదు, కానీ ఆయన ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా పనిచేశారన్న వాస్తవాన్ని ఎలా మర్చిపోగలం?" అంటూ ఘాటైన విమర్శలు చేశారు.