Chandrababu: శ్రీదేవిపై దాడిని చంద్రబాబు ఎందుకు ఖండించలేదు?: అంబటి రాంబాబు
- వైసీపీపై చంద్రబాబు కావాలనే బురద చల్లుతున్నారు
- జగన్ అందిస్తున్న సుపరిపాలనకు అడ్డు తగులుతున్నారు
- చంద్రబాబు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని సహజ సంపదలను టీడీపీ నేతలు దోచుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులే దొంగలుగా మారారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఆకాంక్షల మేరకు పాలిస్తున్నారని... మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను నెరవేర్చుతున్నారని చెప్పారు. నీతివంతమైన పాలనను వైసీపీ అందిస్తోందని... కానీ, కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జగన్ అందిస్తున్న సుపరిపాలనకు చంద్రబాబు అడ్డు తగులుతున్నారని అన్నారు.
టీడీపీ మంచి పనులు చేస్తే... ప్రజలు ఎందుకు ఓడిస్తారని అంబటి ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. సొంత పార్టీలోని నేతలనే చంద్రబాబు కాపాడుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు. 2002లో మాచర్లలో ఏడు హత్యలు జరిగాయని అన్నారు. పల్నాడులో లేని ఉద్రిక్తతలను ఇప్పుడు సృష్టిస్తున్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిని దురహంకారంతో దూషిస్తే... చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఎస్సీ ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని క్రిస్టియన్ గా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.