Crime News: నా మాట వింటే ఒల్లంతా బంగారమే అన్నాడు : ఇల్లు గుల్ల చేసి పోయాడు
- చౌక బంగారం ఆశ చూపి రూ.8 లక్షలకు టోకరా
- విజయవాడలో మోసపోయిన తల్లీకొడుకులు
- బాధితులు .పశ్చిమగోదావరి జిల్లా పి.నర్సాపురం వాసులు
మెడలో బంగారం గొలుసులు...చేతి వేళ్లకు ఉంగరాలు...బ్రాస్‌లెట్...ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటినిండా బంగారమే. అతన్ని చూడగానే ఆ తల్లీకొడుకు కళ్లు జిగేల్ మన్నాయి. పరిచయం చేసుకోవాలని ఆరాటపడ్డారు. మాట కలిపారు. చేతికి చిక్కారని భావించిన నిందితుడు వారిద్దరినీ మాటల్లో దించాడు. చౌకగా బంగారం వస్తున్నందునే ఈ హంగు, ఆర్భాటం అంటూ నమ్మబలికాడు. నన్ను నమ్మితే మీ ఒంటి నిండా బంగారమే అన్నాడు. అంతే తల్లీకొడుకులు అతని బుట్టలో పడ్డారు. రూ.8 లక్షలు కోల్పోయాక గాని అసలు మోసం తెలిసి రాలేదు.
విజయవాడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...పశ్చిమగోదావరి జిల్లా పి.నర్సాపురానికి చెందిన అట్లూరి భార్గవ్, అతని తల్లి విజయలక్ష్మికి ఇటీవల వారణాసి వెళ్లినప్పుడు శ్రీధర్ కృష్ణ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని ఒంటి నిండా బంగారం చూసి తల్లీకొడుకులు ఆశ్చర్యపోతుంటే తక్కువ ధరకు తనకు బంగారం వస్తుందని, అందుకే ఇన్ని వస్తువులు కొన్నానని చెప్పాడు.
అతని మాటలు తల్లీకొడుకులు విశ్వసించడంతో విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్దకు డబ్బుతో వస్తే మీకు కూడా బంగారం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన తల్లీకొడుకులు నిన్న అతను చెప్పిన హోటల్‌కు వెళ్లారు. నిందితుడు అక్కడే వారికి భోజనం ఏర్పాట్లు కూడా చేయించాడు. అనంతరం వారిని వెంటబెట్టుకుని పాతబస్తీలోని ఓ బంగారం దుకాణం వద్దకు వెళ్లాడు.
తన మెడలో గొలుసుతీసి అక్కడి వ్యాపారికి ఇచ్చాడు. ఇది అమ్మితే ఎంత వస్తుందని అడిగాడు. అతను లెక్కలు వేసి లక్షా డెబ్బయి ఐదు వేలు వస్తుందని చెప్పడంతో తల్లీకొడుకులకు ఆ బంగారం మీద మరింత గురి కుదిరింది. దీంతో వెంటనే బ్యాంకు నుంచి డ్రాచేసి తెచ్చిన రూ.8 లక్షలు అతనికి ఇచ్చారు.
అనంతరం 'మీరు హోటల్ రూం వద్దకు వెళ్లండి, నేను బంగారం తీసుకువస్తాను' అని చెప్పడంతో తల్లీకొడుకులు నమ్మి అక్కడికి వెళ్లారు. ఓ గంట తర్వాత శ్రీధర్ కృష్ణకు ఫోన్ చేస్తే తాను రావడానికి ఆలస్యమవుతుందని, హోటల్ వద్దే వేచి ఉండాలని చెప్పాడు. కొంత సేపటి తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటు నుంచి స్పందన లేకపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించిన తల్లీకొడుకులు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.