KCR: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిరావడం దురదృష్టకరం: కేసీఆర్
- గత ఏడాదిన్నరగా దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడింది
- కేంద్ర ఆర్థిక విధానాలను రాష్ట్రాలు అనుసరించడం మినహా మరో గత్యంతరం లేదు
- దీనికి తెలంగాణ మినహాయింపు కాదు
గత ఏడాదిన్నరగా దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దిగజారిన ఆర్థిక పరిస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని చెప్పారు. వాహనాలు కొనేవారు లేక ఆటోమొబైల్ రంగం కుదేలైపోయిందని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
దేశంలో స్థూల ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వమే శాసిస్తుందని... కేంద్రం తీసుకొచ్చిన విధానాలను రాష్ట్రాలు అనుసరించడం మినహా మరో గత్యంతరం లేదని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదని చెప్పారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో... 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా బడ్జెట్ ను రూపొందించాల్సి వచ్చిందని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థికశాస్త్ర మేధావుల సలహాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మేధోమధనం చేసి బడ్జెట్ ను రూపొందించారని తెలిపారు.