Haryana: మళ్లీ చేతులు కలిపిన కాంగ్రెస్, బీఎస్పీ
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీకి నిర్ణయం
- మాయావతిని కలిసిన హస్తం పార్టీ నేతలు
- సార్వత్రిక ఎన్నికల తర్వాత మారుతున్న సమీకరణాలు
సార్వత్రిక ఎన్నికల వరకు ఉప్పు, నిప్పులా మసలిన కాంగ్రెస్, బీఎస్పీ మధ్య మళ్లీ పొత్తు పొడుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కలిసి నడవాలని రెండు పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పది ఎంపీ స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో త్వరలోనే హర్యానాలో ఎన్నికలు జరగనుండడంతో ఆదివారమే ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మరోవైపు పొత్తులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే బీఎస్పీతో పొత్తుకు స్నేహ హస్తం అందించింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా నిన్న బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రతిపాదనపై చర్చించారు. దీనికి మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల ప్రకటన వెలువడనుంది.