Donald Trump: ఆ విషయం భారత్-పాక్ లకు తెలుసు.. ఇక వారి ఇష్టం: డొనాల్డ్ ట్రంప్
- భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి
- ఇరు దేశాలతో సంప్రదింపులు జరిపా
- మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమన్న ప్రెసిడెంట్
గతంలో పోల్చితే భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాలతో తాను సంప్రదింపులు జరిపానని... వారు కోరుకుంటే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ఆయన మరోసారి తెలిపారు. ఈ విషయం ఇరు దేశాలకు తెలుసని... ఇక వారి ఇష్టమని చెప్పారు.
గతంలో అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో జరిగిన భేటీ సందర్భంగా కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ, ఇది అంతర్గత వ్యవహారమని... ఎవరి జోక్యం అవసరం లేదని ఘాటుగా స్పందించింది. దీంతో, ట్రంప్ కొంత తగ్గారు. ఫ్రాన్స్ లో ఇటీవల జరిగిన జీ-7 సదస్సులో మోదీ, ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, కశ్మీర్ వివాదాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.