Nara Lokesh: ఎస్వీయూలో అన్ని అర్హతలున్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారు?: నారా లోకేశ్ ఆగ్రహం
- వైసీపీ కార్యకర్తలను అక్రమంగా వర్శిటీలోకి పంపారంటూ లోకేశ్ విమర్శలు
- జగన్ చేస్తున్నవి కులరాజకీయాలంటూ మండిపాటు
- ఏ ప్రాతిపదికన ఎస్వీయూలో కొత్తవారిని తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్
ఏపీ సర్కారు కులరాజకీయాలకు పాల్పడుతోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ గారూ, పవిత్రమైన విద్యాలయాలను కూడా మీ కుల రాజకీయాలతో ఎందుకు భ్రష్టుపట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎస్వీ యూనివర్శిటీలో అన్ని అర్హతలు ఉండి, గత ఆరేళ్లుగా విధుల్లో ఉన్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ నిలదీశారు. మీకు కావాల్సిన ఓ సామాజిక వర్గం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ విమర్శించారు.
వైసీపీ కార్యకర్తలను అక్రమ మార్గంలో విశ్వవిద్యాలయంలోకి పంపించి ఉపాధి కల్పిస్తున్నారని, ఈ ఘటనపై విచారణ జరగాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అసలు, ఏ ప్రాతిపదికన కొత్తవారిని తీసుకున్నారో ప్రజలకు తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల సాయంతో విద్యార్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీ ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేస్తుంటే సామాన్యుడు ప్రశ్నించకూడదా? ఏమనుకుంటున్నారు మీరు? హక్కులను కాలరాస్తాం, ప్రశ్నించే గొంతు నొక్కేస్తాం, అణగదొక్కేస్తాం వంటి డైలాగులు ప్రజాస్వామ్యంలో చెప్పాలని చూస్తే తెలుగుదేశం చూస్తూ ఊరుకోదు, ఖబడ్దార్!" అంటూ హెచ్చరించారు.