Telugudesam: టీడీపీ చేపట్టిన 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమానికి అనుమతి లేదు: గురజాల డీఎస్పీ స్పష్టీకరణ
- పల్నాడులో పెరుగుతున్న ఉద్రిక్తతలు
- అమీతుమీకి సిద్ధమైన టీడీపీ, వైసీపీ
- నేతలు గ్రామాల్లోకి వచ్చి ఉద్రిక్తతలు పెంచడం సరికాదన్న డీఎస్పీ
టీడీపీ, వైసీపీ అమీతుమీకి సిద్ధపడడంతో పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేపు 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమానికి టీడీపీ ఏర్పాట్లు చేస్తుండగా, వైసీపీ కూడా పోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు మాచర్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
టీడీపీ తలపెట్టిన 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు గ్రామంలోకి వచ్చి ఉద్రిక్తతలు పెంచడం సరికాదని హితవు పలికారు. మరో రెండు రోజులు సమయం ఇస్తే అందరూ గ్రామంలోకి తిరిగి వస్తారని డీఎస్పీ తెలిపారు. గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.