Narendra Modi: ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు
- ముస్లింలపై విరుచుకుపడటం తగదు
- దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టండి
- మోదీ ప్రభుత్వం నిద్రావస్థ నుంచి మేల్కోవాలన్న ఒవైసీ
ప్రధాని మోదీ, బీజేపీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఎంఐఎం నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్దీన్ మాట్లాడుతూ, ముస్లింలపై విరుచుకుపడటం కన్నా దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. చరిత్రలో యజీద్ అనే వ్యక్తి రోజూ కోతిని తాకేవాడు, చివరకు ఆ కోతే అతన్ని కొరికేసిందని, అలాగే, మోదీ చుట్టూ తిరుగుతున్న కోతులు కూడా ఏదో ఒక రోజూ ఆయన్ని కొరుక్కుతింటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జార్ఖండ్ లో మూక దాడికి గురై మృతి చెందిన తబ్రెజ్ అన్సారీ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని నీరుగార్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే మూక దాడుల నిందితులు ఉన్నారో వారిని ప్రభుత్వం కాపాడుతూ, వారిపై ఉన్న కేసులను నీరుగార్చేలా చేస్తోందని ధ్వజమెత్తారు. మూక దాడిలో తీవ్రంగా గాయపడ్డ తబ్రెజ్ ను ఆసుపత్రికి తరలించినట్టయితే అతను బతికి ఉండేవాడని అన్నారు. మూకదాడులకు వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన నిద్రావస్థ నుండి మేల్కొని, ప్రజల జీవన హక్కును కాపాడేందుకు రాజ్యాంగబద్ధమైన విధిని నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు.