Chandrababu: చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన అచ్చెన్నాయుడు, నన్నపనేని అరెస్ట్
- చంద్రబాబు, నారా లోకేశ్ లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- గుంటూరు, పల్నాడుల్లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 విధింపు
- పున్నమి గెస్ట్ హౌస్ కు తరలింపు
టీడీపీ, వైసీపీలు నేడు పోటాపోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు, పల్నాడుల్లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 విధించారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలను నిర్వహించడంపై నిషేధం విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మీడియాకు కూడా పోలీసులు అనుమతిని నిరాకరించారు.
మరోవైపు, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు నిరాహారదీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల వరకు ఆయన నిరాహారదీక్ష కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ నిరాహారదీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పున్నమి గెస్ట్ హౌస్ కు తరలించారు.