Ali baba: ఉబికి వస్తున్న కన్నీటి నడుమ... 'అలీబాబా'ను వీడిన జాక్ మా!
- చైనాలో జాక్ మాకు వీడ్కోలు
- డానియల్ జాంగ్ కు బాధ్యతల అప్పగింత
- నాలుగు గంటలు సాగిన కార్యక్రమం
దాదాపు 80 వేల మంది పెట్టుబడిదారులు, సంస్థలో పనిచేసే ఉద్యోగులు... నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఓ వైపు భావోద్వేగం, మరోవైపు ఆనందం. గత సంవత్సరం తాను హామీ ఇచ్చిన విధంగా బిలియనీర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అలీబాబా సంస్థను విశ్వవ్యాప్తం చేసిన జాక్ మా, తన బాధ్యతలను సీఈఓ డానియల్ జాంగ్ కు అప్పగించే క్షణాలు...
సుమారు 20 సంవత్సరాల క్రితం ఓ చిన్న ఈ-కామర్స్ కంపెనీగా మొదలైన అలీబాబా, ఇంత ఎత్తునకు ఎదుగుతుందని ఎవరూ ఊహించివుండరు. ఆ సంస్థను తన మానస పుత్రికగా భావించిన జాక్ మా, ఇప్పుడు సంస్థను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చేసింది. ఈ కార్యక్రమం తూర్పు చైనా పరిధిలోని జాంగ్జో నగరంలో అత్యంత వైభవంగా జరిగింది.
నృత్య కళాకారుల ప్రదర్శనలు, రాక్ స్టార్ల అలరించే పాటలతో మొదలైన కార్యక్రమం, జాక్ మా కన్నీటి ప్రసంగంతో ముగిసింది. "ఈ రాత్రి తరువాత నేను కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాను. ఈ ప్రపంచం చాలా మంచిది. నాకు ఎన్నో అవకాశాలను ఇస్తుందనే భావిస్తున్నాను. ఇంతవరకూ నేను చేసిన పనిని ఎంతో ప్రేమించాను. అందుకే నేను త్వరగా రిటైర్ అవుతున్నాను" అని పెల్లుబుకుతున్న కన్నీటితో జాక్ మా వ్యాఖ్యానించిన క్షణం, యావత్ ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
ఇక ఈ కార్యక్రమం చైనా సోషల్ మీడియా దిగ్గజం 'వైబో'లో వైరల్ అయింది. జాక్ మాకు వీడ్కోలు పలుకుతూ, కోట్లాది అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో జాక్ మాతో పాటు అలీబాబా సహ వ్యవస్థాపకుడు లూసీ పెంగ్, టెక్నాలజీ కమిటీ సీఈఓ వాంగ్ జియాన్ తదితరులు పాల్గొన్నారు.