sabita indrareddy: బొకేలు వద్దు...పెన్నులు, పుస్తకాలు తెండి: తెలంగాణ మంత్రి సబిత సూచన
- వాటిని స్వయంగా పాఠశాల విద్యార్థులకు అందించినా ఓకే
- ఆ డబ్బుల్ని సీఎం సహాయ నిధికి ఇవ్వండి
- కిషన్ రెడ్డి బాట పట్టిన టీఆర్ఎస్ మంత్రి
తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చేవారు ఖరీదైన పూలు, బొకేలు తెచ్చి నిధులు వృథా చేయవద్దని, వాటితో పుస్తకాలు, పెన్నులు కొని తేవాలని ఇటీవల కేసీఆర్ మంత్రి వర్గంలో చేరిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కోరారు. తనకు తెచ్చిచ్చినా, లేదంటే వాటిని పాఠశాల విద్యార్థులకు మీరే పంపిణీ చేసినా సంతోషిస్తానని తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో మహేశ్వరం ఎమ్మెల్యే అయిన సబితకు చోటు దక్కిన విషయం తెలిసిందే.
గతంలో కాంగ్రెస్లో ఉంటూ వైఎస్సార్ మంత్రి వర్గంలో హోం మంత్రిగా పనిచేసిన సబిత ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్నాళ్లపాటు రాజకీయ ప్రాధాన్యం కోల్పోయారు. ఇటీవల ఎన్నికల ముందు టీఆర్ఎస్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మొదటి దశలో అవకాశం దక్కక పోయినా విస్తరణలో చాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా అభిమానించేందుకు వస్తున్న వారిని ఉద్దేశించి మంత్రి ఈ సూచన చేశారు.
అభినందనల పేరుతో డబ్బు వృథా చేయకుండా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు కొనివ్వాలని, లేదంటే ఆ నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయాలని కోరారు. కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత కిషన్రెడ్డి కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తాజాగా మంత్రి సబిత ఆయనను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు.