Hyderabad: ప్రారంభమైన ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర
- హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలుతున్న విగ్రహాలు
- హుస్సేన్ సాగర్ లో తొలి నిమజ్జనం ఖైరతాబాద్ బడా గణేశ్దే
- ఒంటిగంటకల్లా పూర్తి
భక్తుల పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు నిమజ్జనానికి తరలుతున్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రారంభమైన గణేశ్ శోభాయాత్రలన్నీ ట్యాంక్‌బండ్ వైపుగా దారి తీస్తున్నాయి.
ఇక, ఖైరతాబాద్ బడా గణేశ్ కూడా గంగ ఒడికి పయనమయ్యాడు. గతరాత్రి చివరి పూజలు అందుకున్న శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని భారీ క్రేన్ సాయంతో ట్రక్కుపైకి ఎక్కించారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌లో జరిగే మొదటి నిమజ్జనం ఖైరతాబాద్ మహాగణపతిదేనని నిర్వాహకులు తెలిపారు.
ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని ఆరో నంబరు క్రేన్ దగ్గరకు గణపతి చేరుకుంటాడని, ఒంటిగంటలోపే నిమజ్జనాన్ని పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా, భారీ గణపతి నిమజ్జనం సాఫీగా సాగేందుకు నిమజ్జనం చేసే క్రేన్ వద్ద 20 అడుగులకు పైగా లోతును పెంచినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.