Hyderabad: కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకోనన్న అమ్మాయి.. కమిషనర్‌కు లేఖ రాసి, రాజీనామా చేసిన పోలీస్!
- రెండు వారాల క్రితం పెళ్లిచూపులకు
- కానిస్టేబుల్ అనగానే తాను చేసుకోలేనన్న అమ్మాయి
- సీపీకి రాసిన లేఖ వైరల్
కానిస్టేబుల్ అంటే 24 గంటలూ డ్యూటీలోనే ఉండాలని, అటువంటి అబ్బాయిని తాను పెళ్లి చేసుకోలేనని ఓ యువతి తెగేసి చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఏకంగా ఉద్యోగాన్నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లాడు.
సిద్ధాంతి ప్రతాప్ అనే యువకుడు చార్మినార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం పెళ్లి చూపుల నిమిత్తం ఓ యువతిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అయితే, అబ్బాయి కానిస్టేబుల్ అని తెలుసుకున్న యువతి.. పోలీస్ అంటే రోజంతా విధుల్లోనే ఉండాల్సి ఉంటుందని, కాబట్టి ఈ సంబంధం తనకొద్దంటూ నిరాకరించింది. అమ్మాయి సమాధానంతో విస్తుపోయిన యువకుడు ఈ విషయాన్ని సీపీ అంజనీకుమార్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను పోలీస్ ఉద్యోగంపై ఉన్న ఇష్టంతో నాలుగేళ్ల క్రితం ఉద్యోగంలో చేరానని సీపీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ నెల 7న రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీపీకి లేఖ రాసిన ప్రతాప్ తన బాధను, పోలీసు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాడు. కానిస్టేబుళ్లకు వారి సర్వీస్ ప్రకారం పదోన్నతులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు కూడా కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్గానే మిగిలిపోతున్నారని పేర్కొన్నాడు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో అయితే ఇలా ఉండదన్నాడు. ఇవన్నీ చూసి, ఆలోచించిన తర్వాతే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నాడు. కాగా, అతడి రాజీనామాను ఉన్నతాధికారులు ఆమోదించినదీ, లేనిదీ తెలియరాలేదు.