Hyderabad: ఖైరతాబాద్ మహాగణపతికి మహా సేవకుడు
- ఆరేళ్లుగా విగ్రహాన్ని తరలించే వాహన డ్రైవర్ ఆయనే
- 11 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు ట్రాలీ ఇది
- దీన్ని నడపాలంటే ప్రత్యేక సామర్థ్యం తప్పనిసరి
దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న ఖైరతాబాద్ వినాయకుడి సేవలో ఆయనదో ప్రత్యేకం. అత్యంత ఈ భారీ విగ్రహాన్ని శోభాయాత్రలో జాగ్రత్తగా హుస్సేన్‌సాగర్ వరకు తీసుకువెళ్లి నిమజ్జనం జరిగేలా చేయడంలో ఆయనది ప్రత్యేక పాత్ర. గడచిన ఆరేళ్లుగా విగ్రహాన్ని తరలిస్తున్నది ఆయనే. అతని పేరు భాస్కర్‌రెడ్డి. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి ఎస్టీసీకి చెందిన ట్రాలీ, ఆధునిక క్రేన్ వినియోగిస్తారు. 11 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు, 26 టైర్లతో ఉన్న ఈ ట్రాలీపై 55 టన్ను బరువు సునాయాసంగా తీసుకు వెళ్లవచ్చు. ఈ ట్రాలీని ఆరోసారి నడుపుతున్న వ్యక్తి భాస్కర్‌రెడ్డి.
అలాగే, ఈ భారీ విగ్రహం నిమజ్జనానికి ఉపయోగించే ఆధునిక క్రేన్ జర్మనీ టెక్నాలజీతో రూపొందించినది. రిమోట్ కంట్రోల్ సాయంతో ఇది పనిచేస్తుంది. బరువు ఎత్తగానే ఎంత బరువుంది, ఎంత ముందుకు తీసుకువెళ్లగలుగుతుందో చూపుతుంది. 72 టన్నుల బరువైన ఈ క్రేన్ 400 టన్నుల బరువును సునాయాసంగా ఎత్తుతుంది. జాక్ 61 మీటర్ల ఎత్తు వరకు లేపగలదు. దీని పొడవు 14 మీటర్లు, వెడల్పు 4 మీటర్లుండగా దీనికి 12 టైర్లుంటాయి.