Andhra Pradesh: సంస్థ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ.. ‘ట్రాన్స్ ట్రాయ్’ ఉద్యోగుల నిరసన.. ప్రభుత్వానికి ఫిర్యాదు!
- పోలవరం ప్రాజెక్టుకు పాత కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్
- ‘ట్రాన్స్ ట్రాయ్’ ఈడీని అడ్డుకున్న సబ్ కాంట్రాక్టర్లు
- బిల్లులు పాస్ కాగానే బకాయిలు చెల్లిస్తామన్న ఈడీ
ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు పాత కాంట్రాక్టు సంస్థ అయిన ట్రాన్స్ ట్రాయ్ ఉద్యోగులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. సంస్థ నుంచి తమకు జీతాలు అందడం లేదని జలవనరుల శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అనంతరం సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్ ట్రాయ్’ ఈడీ సాంబశివరావును సబ్ కాంట్రాక్టర్లు, సామగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు అడ్డుకున్నారు.
రూ.23 కోట్ల బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపాలని బాధితులు కోరారు. కంపెనీ ఇబ్బందుల్లో ఉండటం వల్లే బకాయిలు చెల్లించలేకపోయామని, బిల్లులు పాస్ కాగానే ఎండీతో మాట్లాడి చెల్లిస్తామని సాంబశివరావు చెప్పినట్టు సమాచారం.