Justis Eshwaraiah: జస్టిస్ ఈశ్వరయ్యకు కీలక పదవినిచ్చిన జగన్... ఏపీ ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ గా నియామకం!
- ఏసీజే ప్రవీణ్ కుమార్ ను సంప్రదించిన ప్రభుత్వం
- ఈశ్వరయ్య నియామకంపై అతి త్వరలో జీవో
- కమిషన్ కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్యకు సీఎం జగన్ కీలక పదవిని ఇవ్వడానికి నిర్ణయించారు. ఏపీ ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన నియామకం ఖరారైంది. ఇప్పటికే ఈ విషయంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను సంప్రదించిన ప్రభుత్వం, ఈశ్వరయ్య నియామకంపై చర్చించింది.
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఫీజుల నియంత్రణ వంటి అంశాలపై మరింత పారదర్శక పర్యవేక్షణ జరగాలన్న ఉద్దేశంతో ఈశ్వరయ్య నియామకానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఈశ్వరయ్య నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల జీవో అతి త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కమిషన్ పరిధిలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు ఉంటాయి. వీటిల్లో ప్రవేశాల నుంచి వసతుల వరకూ అన్నింటినీ కమిషన్ పర్యవేక్షిస్తుంది. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఈ కమిషన్ కు ఉంటాయి.