Andhra Pradesh: విజయవాడకు చేరుకున్న నీతిఆయోగ్ వైస్ చైర్మన్.. మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ!

  • గన్నవరం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కలెక్టర్
  • ఏపీ ఆర్థికలోటు, కేంద్ర సాయంపై జగన్, ఎల్వీ నివేదికలు
  • పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనున్న రాజీవ్

నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఈరోజు విజయవాడకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజీవ్ కుమార్ కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘనస్వాగతం పలికారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా ఆర్థికలోటు, కేంద్రం నుంచి రావాల్సిన పారిశ్రామిక రాయితీలు, నిధుల విషయంలో ముఖ్యమంత్రి జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజీవ్ కుమార్ కు నివేదికలు సమర్పించనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనలో భాగంగా పెట్టుబడి లేకుండా చేపడుతున్న ‘పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం’పై రాజీవ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించనున్నారు. ఈ తరహా వ్యవసాయం విషయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించడంపై జగన్, రాజీవ్ కుమార్ చర్చించే అవకాశముంది. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం రాజీవ్ కుమార్ అమరావతి సమీపంలోని పెట్టుబడిలేని సాగు క్షేత్రాలను పరిశీలిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళతారు.

  • Loading...

More Telugu News