TRS: పదవి కావాలని కేసీఆర్ ను ఎప్పుడూ అడగలేదు.. టీఆర్ఎస్ తో విభేదాలు లేవు: ఎమ్మెల్యే షకీల్
- జిల్లా అభివృద్ధి కోసం అరవింద్ ను కలిస్తే తప్పులేదు
- భవిష్యత్తులో అవకాశం ఇస్తారనే భావిస్తున్నా
- టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు
గులాబీ జెండాకు మేమే బాసులం అంటూ ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో వేడిని పుట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ భేటీ కావడం కలకలం రేపింది. బీజేపీలో షకీల్ చేరబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో, తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, తన చర్యల పట్ల వివరణ ఇచ్చుకున్నారు. ఓ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే అరవింద్ ను కలిశానని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం అరవింద్ ను కలిస్తే తప్పులేదని అన్నారు.
బీజేపీలో లేదా కాంగ్రెస్ లో చేరుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. టీఆర్ఎస్ తో తనకు విభేదాలు లేవని పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి కావాలని తాను కేసీఆర్ ను అడగలేదని... ఒకవేళ పదవి కావాలని అడిగినా అందులో తప్పేముందని ప్రశ్నించారు. భవిష్యత్తులో తనకు అవకాశం ఇస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.