Telugudesam: అచ్చెన్నాయుడు నేతృత్వంలో డీజీపీ వద్దకు తరలివెళ్లిన టీడీపీ నేతలు
- వైసీపీ దాడులు చేస్తోందంటూ డీజీపీకి ఫిర్యాదు
- వైసీపీ దాడులపై రెండు పుస్తకాలను డీజీపీకి అందించిన టీడీపీ బృందం
- బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సవాంగ్
రాష్ట్రంలో పలు చోట్ల తమ కార్యకర్తలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ టీడీపీ కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది టీడీపీ సభ్యుల బృందం ఇవాళ గౌతమ్ సవాంగ్ వద్దకు తరలివెళ్లింది. వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా, వైసీపీ దాడులపై తాము ప్రచురించిన రెండు పుస్తకాలను కూడా ఆయనకు సమర్పించారు.
దీనిపై డీజీపీ సవాంగ్ సానుకూలంగా స్పందించారు. ఉద్రిక్తతలకు కారణమైన పలు ఘటనలపై తాము దర్యాప్తు చేస్తున్నామని, తప్పకుండా న్యాయం చేస్తామని మాటిచ్చారు. టీడీపీ నేతలు ఇటీవలి పల్నాడు దాడుల అంశాన్నే డీజీపీ వద్ద ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.