Andhra Pradesh: ఏపీ డీజీపీతో వైసీపీ, దళిత సంఘాల భేటీ.. నన్నపనేనిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు!
- ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ర్యాలీ
- టీడీపీ నేతలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే
- చంద్రబాబు వీరికి ట్రైనింగ్ ఇచ్చారని ఆరోపణ
తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారి చేసిన ‘దళిత కులం’ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో రగడను రేపాయి. నన్నపనేని తనను కులం పేరుతో దూషించారని మహిళా ఎస్సై అనురాధ ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదైంది. తాజాగా ఈరోజు నన్నపనేనికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో దళిత సంఘాలు, వైసీపీ కార్యకర్తలు మంగళగిరిలో భారీ ర్యాలీ చేపట్టాయి.
ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు, నన్నపనేని, చింతమనేని వంటివారు రెచ్చిపోయి మాట్లాడారు. అందుకు చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. చింతమనేని ఇంకా దళితుల్ని దూషిస్తూనే ఉన్నారు. కాబట్టి వీరిపై బుక్కయిన కేసుల ప్రకారం తక్షణం వీరిని అరెస్ట్ చేయాలి. మహిళా కమిషన్ చైర్ పర్స్ న్ గా పనిచేసిన టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి మాట్లాడాల్సిన మాటలేనా అవి? అని అడుగుతున్నా’ అంటూ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన అనంతరం వీరంతా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో సమావేశమయ్యారు. నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని కోరారు. ఈ మేరకు ఫిర్యాదును అందజేశారు.