Vijayawada: ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై భూ కబ్జా ఆరోపణలు!
- ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ‘స్పందన’కు ఫిర్యాదు
- ఆ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
- కబ్జాదారులపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు
ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు భూ కబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ హయాంలో జరిగిన భూ దందాపై ‘స్పందన’ కార్యక్రమం బయటపెట్టింది. ఎన్టీఎస్ సర్వే నెంబర్ వన్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ‘స్పందన’కు ఫిర్యాదు అందింది. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించారు. విజయవాడ, మధురానగర్ లో కుటుంబరావు కబ్జా చేశారని ఆరోపిస్తున్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన భూమిలో కుటుంబరావు సోదరుడు ఏర్పాటు చేసిన బోర్డులను అధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాలతో రికార్డులు పరిశీలించి విచారించినట్టు చెప్పారు. అర్బన్ ల్యాండ్ చట్టాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వ మిగులు భూమిని ఆక్రమించినట్టు తేలిందని అన్నారు. రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదోవ పట్టించి, పట్టా భూమిగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని, కబ్జాదారులపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టినట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూమిని టాస్క్ ఫోర్స్ బృందాలు పర్యవేక్షిస్తాయని, ఎవరైనా ఆ భూమిలోకి చొరబడాలని చూస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.