Jagan: ఊళ్లో మమ్మల్ని వెలివేశారు.. మా నాన్న, తాతను చంపేస్తారట!: ముఖ్యమంత్రి జగన్కు 8 ఏళ్ల చిన్నారి లేఖ
- జగన్కు రామచంద్రపురం బాలిక లేఖ
- తమతో ఎవరూ మాట్లాడడం లేదని ఆవేదన
- వైరల్ అవుతున్న లేఖ
స్కూలులో తనతోపాటు చదువుకుంటున్న పిల్లలు ఎవరూ మాట్లాడడం లేదని, తమను ఊరి నుంచి వెలివేశారని చెబుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి 8 ఏళ్ల చిన్నారి రాసిన లేఖ అందరినీ కదిలిస్తోంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన బాలిక కోడూరి పుష్ప ఈ లేఖ రాసింది. తనకో చెల్లెలు గాయత్రి, తమ్ముడు హేమంత్ ఉన్నారని, తన తండ్రి పేరు రాజు, తల్లి పేరు జానకి అని లేఖలో పేర్కొంది. తాత పేరు వెంకటేశ్వర్లు, నానమ్మ పేరు మంగమ్మ అని తెలిపింది.
ఈ నెల నాలుగో తేదీ నుంచి తమ ముగ్గురితో స్కూలులో ఎవరూ మాట్లాడడం లేదని, ఎవరైనా మాట్లాడితే రూ. 10 వేల జరిమానా వేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను ఊర్లోనుంచి వెలివేశారని అందరూ అంటున్నారని పేర్కొంది. తమతో ఎవరూ మాట్లాడడం లేదని, ఆడుకోవడానికి కూడా రావడం లేదని పేర్కొంది. అంతేకాదు, నాన్న, తాతను చంపేస్తారని స్నేహితులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు చాలా భయంగా ఉందని పేర్కొంటూ లేఖలో తండ్రి ఫోన్ నంబరు, వివరాలను ఇచ్చింది.
కాగా, స్థానికంగా ఉన్న వివాదం కారణంగా వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయాన్ని పుష్ప లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లింది.