yadiyurappa: ధనవంతుల బీపీఎల్ రేషన్ కార్డులపై యడియూరప్ప సర్కారు కొరడా
- ధనవంతుల చేతుల్లో పడి దుర్వినియోగం అవుతున్న రేషన్ కార్డులు
- స్వచ్ఛందంగా అప్పగించేందుకు ఈ నెల 30 వరకు గడువు
- పట్టించిన వారికి భారీ నజరానా
రేషన్ కార్డుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కర్ణాటకలోని యడియూరప్ప సర్కారు నిర్ణయించింది. నిరుపేద కుటుంబాల కోసం ఉద్దేశించిన (బీపీఎల్) రేషన్ కార్డులు కొందరు ధనవంతుల చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. నిరుపేదలకు అందాల్సిన లబ్ధిని ధనవంతులు పొందుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ధనవంతుల వద్ద ఉన్న రేషన్ కార్డులను పట్టించే బాధ్యతను ప్రజలకే అప్పగించింది.
ధనవంతుల వద్ద ఉన్న రేషన్ కార్డుల గురించి సమాచారం అందించిన వారికి భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు. అలాగే, ధనవంతులు తమ వద్ద ఉన్న బీపీఎల్ కార్డులను స్వచ్ఛందంగా అప్పగించేందుకు ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడువు విధించింది. ఆపై రేషన్ కార్డుతో దొరికిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.