Odisha: అత్తమ్మ ...అమ్మగా మారి కోడలికి పునర్వివాహం

  • పెళ్లయిన ఐదు నెలలకే కాలం చేసిన కొడుకు
  • కోడలి జీవితం మోడుబారి పోకూడదని నిర్ణయం
  • సొంత సోదరుని కొడుకుకి ఇచ్చి పెళ్లి

అత్తా కోడళ్లంటే తూర్పు పడమరే అనుకునే రోజులివి. వివాదాలే తప్ప అభిమానం అంతగా ఉండదని సాధారణంగా భావిస్తుంటారు. కానీ అత్తలోని అమ్మ మనసు ఆమె జీవితానికో వెలుగు రేఖ అయ్యింది. పెళ్లయిన ఐదు నెలలకే భర్తను కోల్పోయి జీవితం అంధకారంలో చిక్కుకుని ఇక మోడువారి పోయినట్టే అనుకున్న సమయంలో అత్తే అమ్మగా మారి ఆమెకు పునర్వివాహం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. దీంతో మాజీ సర్పంచ్‌ ప్రతిమ బెహరాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

వివరాల్లోకి వెళితే...ఒడిశా రాష్ట్రం అనుగుల్‌ ప్రాంతం గోబరా గ్రామానికి చెందిన ప్రతిమ బెహర కొడుకు రష్మిరంజన్‌కు, తురాంగ గ్రామానికి చెందిన లిల్లీ బెహరాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లయింది. రష్మిరంజన్‌ ఓ గనిలో కార్మికుడు. పెళ్లయిన తర్వాత జులైలో జరిగిన గని ప్రమాదంలో అతను కన్నుమూశాడు. కొడుకు దూరం కావడం, ఐదు నెలలకే కోడలి జీవితం మోడు బారిపోవడంతో ప్రతిమలోని అమ్మ మనసు విలవిల్లాడింది. కొడుకు ఎలాగూ లేడని, కనీసం కోడలికైనా మంచి జీవితాన్నిస్తే తన జీవితానికో సంతృప్తి మిగులుతుందని ఆమె భావించింది.

దీంతో వితంతువైన కోడలికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించింది. ఇందుకు దగ్గర సంబంధమైతే మంచిదన్న ఉద్దేశంతో తన సోదరుడితో సంప్రదించింది. అతను తన కొడుకు సంగ్రామ్‌తో పెళ్లికి అంగీకరించడంతో అనుగుల్‌లోని జగన్నాథుని ఆలయంలో లిల్లీ తల్లిదండ్రుల సమక్షంలో కోడలికి శాస్త్రోక్తంగా మళ్లీ పెళ్లి జరిపించింది. అత్తవారింటికి కూతురిని పంపినట్లు చీర, సారెతో సంప్రదాయబద్ధంగా పంపించి తన బాధ్యత నెరవేర్చుకుంది.

  • Loading...

More Telugu News