Andhra Pradesh: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లను ఎప్పుడు పునరుద్ధరిస్తారో జగన్ సమాధానం చెప్పాలి!: దేవినేని ఉమ
- మేం 65 లక్షల మందిమి ఉన్నాం
- వైసీపీ ప్రభుత్వ చర్యపై ట్రాయ్ కు ఫిర్యాదు చేస్తాం
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని కేబుల్ నెట్ వర్క్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాలు ఆగిపోవడంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. ఏపీలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అంతా 65 లక్షలమంది ఉన్నామని ఉమ తెలిపారు. తామంతా ప్రభుత్వ చర్యలపై ట్రాయ్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు.
ఈ రెండు టీవీ ఛానళ్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నామని స్పష్టం చేశారు. అసలు ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు నిలిపివేశారో కూడా చెప్పలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఈ విషయంలో మంత్రులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.