congerss: విషజ్వరాలపై చర్చకు కాంగ్రెస్ పట్టు... సమయం లేదన్న స్పీకర్
- ఆందోళనకు దిగిన కాంగ్రెస్ సభ్యులు
- తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
- తన మానాన తాను సమాధానాలిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విష జ్వరాలపై చర్చించాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా తీవ్ర పరిస్థితులు ఉన్నందున ఇది అత్యవసరమన్నారు. అయితే ప్రస్తుతం అంత సమయం లేనందున చర్చకు వీలుపడదని స్పీకర్ తేల్చిచెప్పడంతో కాగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో గందరగోళం నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, తక్షణం దీనిపై చర్చించి, ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలివ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. యురేనియం తవ్వకాలపై మా పోరాటంతోనే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఓ వైపు ఆందోళన చేస్తుంటే మరోవైపు ఇవేవీ పట్టించుకోకుండా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వడం గమనార్హం.