KCR: మూడేళ్ల వరకూ కోలుకునే పరిస్థితి లేదు: అసెంబ్లీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- దేశాన్ని ఆక్రమించిన ఆర్థిక మాంద్యం
- కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా రావడం లేదు
- పరిస్థితులను బట్టే బడ్జెట్
- విపక్షాల ఆరోపణలు అవాస్తవమన్న కేసీఆర్
ఆర్థికమాంద్యం దేశం మొత్తాన్ని ఆక్రమించిందని, ఎన్నో రంగాల్లో అమ్మకాలు తగ్గాయని, పలు కంపెనీలు ఉత్పత్తి కోతను విధించాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. మరో మూడేళ్ల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని, అప్పటివరకూ పూర్తిగా కోలుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే ఆర్థికమాంద్యం ప్రభావం ఎలా ఉండబోతుందోనన్న అంశాన్ని తాను వెల్లడించానని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, మాంద్యం ప్రభావాన్ని అంచనా వేసిన మీదటే, బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకు వచ్చామని, ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు చాలా తక్కువగా ఉంటున్నాయని, కేవలం 30 నుంచి 35 వేల కోట్లు మాత్రమే వివిధ పథకాల పేరిట కేంద్ర నిధులు వస్తున్నాయని అన్నారు. తిరిగి తీర్చగలరన్న నమ్మకం ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, లేకుంటే బ్యాంకులు కూడా దూరం జరుగుతున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇండియాను సాకుతున్న ఆరేడు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని, ఇక్కడి నుంచి వసూలవుతున్న పన్ను, ఎన్నో పేద రాష్ట్రాలను ఆదుకుంటోందన్నారు. ప్రభుత్వం నేల విడిచి సాము చేయడం లేదని, ఉన్నంతలోనే సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.