Andhra Pradesh: మూడే మూడు కారణాలు.. ఏపీలో చంద్రబాబును ముంచేశాయి!: టీడీపీ నేత బోడె ప్రసాద్

  • చంద్రబాబు బీజేపీతో పోరాడారు
  • కేసీఆర్ తో గొడవ కారణంగా కులాలు దూరమయ్యాయి
  • యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే

ఎన్నికల సమయంలో ప్రజలకు నగదును పంచే సంస్కృతిని రాజకీయ నాయకులే తీసుకొచ్చారని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడె ప్రసాద్ తెలిపారు.  ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారనీ, కానీ డబ్బులకు మాత్రం అమ్ముడుపోతున్నారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు. తాను ఎన్నికల సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా ప్రజల్లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. ‘పనులన్నీ చేశాను. అన్నిరకాలుగా సేవలు అందించాను. కానీ రాజకీయ పరిస్థితుల్లో ఒక్క అవకాశం అన్న నినాదం(వైసీపీ) బలంగా పనిచేసింది. అందుకే ఓడిపోయా’ అని విశ్లేషించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోడె ప్రసాద్ మాట్లాడారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలవలేదనీ, ఆయన్ను టీడీపీయే గెలిపించిందని బోడె ప్రసాద్ తెలిపారు. ‘చంద్రబాబు మొదట్లో ప్రత్యేకహోదా కావాలని నిలబడ్డారు. కానీ కేంద్రం ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ ద్వారా ఎక్కువ లాభం చేకూరుస్తాం. ఒప్పుకోండి అని సూచించడంతో చంద్రబాబు అంగీకరించారు. కానీ న్యాయం జరగకపోవడంతో బీజేపీపై తిరుగుబాటు చేసి బయటకొచ్చారు. పోరాటం మొదలుపెట్టారు. దానివల్ల కొంత నష్టపోయామని నేను అనుకుంటున్నా.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొంత ఘర్షణ వాతావరణంలోకి వెళ్లడం కారణంగా కొన్ని కులాలు ఏపీలో టీడీపీకి దూరమయ్యాయి. టీడీపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ జగన్ కు అన్నిరకాలుగా సపోర్ట్ చేశారు. బీజేపీ కూడా ఈసీ, పోలీస్ సహా అనేకరకాలుగా వైసీపీకి సాయం చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోటి కలిసి పోటీ చేసుంటే ఓటింగ్ శాతం పెరిగేది. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. ఒకవేళ గెలవకున్నా గౌరవప్రదమైన స్థానం దక్కేది’ అని బోడె ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News