IMD: రానున్న నాలుగు రోజులూ భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
- 19 వరకూ వర్షాలు
- అల్పపీడనం కారణంతో భారీ వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. 19వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన అధికారులు, తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటివరకు మూడు శాతం తక్కువగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు.
ఇక కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్గాలకు అవకాశముందని అధికారులు తెలిపారు. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, నిన్న రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.