Kodela: ఉరి వేసుకున్న స్థితిలో కోడెలను చూసి తట్టుకోలేకపోయిన సహచరులు!
- అసెంబ్లీ ఎన్నికల్లో కోడెల ఓటమి
- ఆపై వెల్లువెత్తిన ఆరోపణలు
- మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం
గుంటూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా, ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల శివప్రసాదరావు, అనూహ్య పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితం, సీలింగుకి వేలాడుతూ కనిపించగా, తొలుత ఆ దృశ్యాన్ని చూసిన సహచరులు, ఇంటి సిబ్బంది హతాశులయ్యారు. ఆ వెంటనే ఆయన్ను కిందకు దింపే సరికే శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు గమనించి, హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు.
గత కొన్ని రోజులుగా, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పరువు తీయాలని చూస్తున్నారని కోడెల ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల, ఇంతటి ఘోరమైన నిర్ణయం తీసుకుని ఉంటారని ఇంటి సభ్యులు విలపిస్తూ చెప్పారు. ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కోడెలకు చికిత్స జరుగుతుండగా, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక కోడెల ఉరి వేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పలువురు తెలుగుదేశం నేతలూ, ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.