air india flight: ఎయిరిండియా ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య... విదేశాల్లో రాష్ట్రపతి ప్రయాణానికి మూడు గంటల బ్రేక్!
- స్విట్జర్లాండ్ నుంచి స్లోవేనియాకు వెళ్తుండగా ఘటన
- చివరి నిమిషంలో లోపం గుర్తించిన సాంకేతిక నిపుణులు
- హోటల్ కి వెళ్లిపోయిన భారత్ ప్రథమ పౌరుడు
విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోసం వినియోగించే ఎయిరిండియా ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణం మూడు గంటలపాటు వాయిదా పడింది. సకాలంలో లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం కూడా తప్పిందని ఇంజనీర్లు తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ ఐస్లాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియాల్లో పర్యటన కోసం ఇటీవల వెళ్లిన విషయం తెలిసిందే. ఐస్లాండ్‌లో పర్యటించి ఆయన స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లో కూడా పర్యటన ముగియడంతో స్లోవేనియాకు నిన్న బయల్దేరారు.
తన ప్రత్యేక విమానంలో ప్రయాణించేందుకు జ్యూరిచ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రయాణం చివరి నిమిషంలో సిబ్బంది విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. రూడర్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించి విమానాన్ని వెంటనే నిలిపివేశారు. దీంతో రాష్ట్రపతి విమానం దిగి తిరిగి తన హోటల్‌కు వెళ్లిపోయారు. ఎయిరిండియా సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్య సరిచేసిన అనంతరం మూడు గంటల తర్వాత రాష్ట్రపతి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారు.