Narendra Modi: వారం రోజుల్లో రెండు సార్లు భేటీ కానున్న మోదీ, ట్రంప్!
- ఆదివారం హ్యూస్టన్ చేరుకోనున్న మోదీ
- ఆదివారం ఎన్నారైలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ, ట్రంప్
- న్యూయార్క్ లో మరోసారి భేటీ కానున్న నేతలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో ఒక వారం వ్యవధిలో రెండు సార్లు భేటీ కానున్నారని అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. మోదీ రెండో సారి ప్రధాని అయిన తర్వాత ఇరువురు నేతలు ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో, ఇరువురు నేతలు నాలుగు నెలల వ్యవధిలోనే నాలుగు సార్లు భేటీ అయినట్టు అవుతుందని ఆయన తెలిపారు.
శనివారంనాడు హ్యూస్టన్ నగరానికి మోదీ చేరుకుంటారు. ఆదివారం ఎన్నారైలు నిర్వహించనున్న భారీ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కూడా విచ్చేయనున్నారు. దాదాపు 50వేల మందికి పైగా ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం ఇదే వారంలో న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు మరోసారి భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా హర్షవర్ధన్ తెలిపారు.