Andhra Pradesh: అమరావతిలో వర్షాలు.. ఏపీ హైకోర్టు భవనంలోకి చేరిన నీరు!
- సీలింగ్ నుంచి నీటి ధార
- నీటిని ఎత్తిపోస్తున్న సిబ్బంది
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతిలో నిర్మించిన సచివాలయంలోకి గతంలో వర్షం కురవగానే నీరు రావడం.. మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై అప్పటి ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. తాజాగా ఏపీ తాత్కాలిక హైకోర్టులోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఇటీవల కురిసిన వర్షాలకు హైకోర్టు తాత్కాలిక భవనం లోపల ఎక్కడికక్కడ లీకేజీ జరిగింది. హైకోర్టులోని ఛాంబర్లలో ఉన్న పైకప్పు నుంచి ధారాళంగా నీరు కారడం ప్రారంభమైంది.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బకెట్లతో నీటిని తోడి బయటపోశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినకుండా వాటిని లీకేజీ లేని ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయం తరహాలోనే తాత్కాలిక హైకోర్టును కూడా నిర్మించారనీ, నాణ్యత పాటించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.