CEC: బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ మర్చిపోండి.. అది గత చరిత్ర: కేంద్ర ఎన్నికల సంఘం
- బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ అసాధ్యం
- ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తాం
- ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు
బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ అనేది ఇకపై గత చరిత్రేనని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ ను నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు తమను కోరాయని... అది అసాధ్యమని అన్నారు. ఈవీఎంల ద్వారానే ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈవీఎంలలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని... కానీ, వాటిని ట్యాంపర్ చేయడం మాత్రం అసాధ్యమని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ఉన్న ప్రాంతాల్లో అదనపు భద్రతాబలగాలను రంగంలోకి దించుతామని తెలిపారు.
దీపావళి, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని సునీల్ అరోరా చెప్పారు. ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచాలని కొన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాయని... ఇదే సమయంలో ఖర్చు పరిమితిని మరింత తగ్గించాలని మరికొన్ని పార్టీలు కోరుతున్నాయని తెలిపారు.