Nirmala Seetharaman: ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే దిశగా కేంద్రం.. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు!
- ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన
- దేశీయ కంపెనీలకు 22 శాతం రేటుతో పన్ను చెల్లించేలా వెసులుబాటు
- కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు ట్యాక్స్ 15 శాతానికి తగ్గింపు
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా, దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా... దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను తీసుకొస్తున్నట్టు తెలిపారు.
దేశీయ కంపెనీలు 22 శాతం రేటుతో ఆదాయపు పన్ను చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు నిర్మల తెలిపారు. దీంతో, సెస్, సర్ ఛార్జ్ లు కలిపి కార్పొరేట్ ట్యాక్స్ 25.17 శాతానికి తగ్గనుంది. అయితే, ఇందులో ఓ షరతును కూడా విధించారు. ఈ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభించవని ఆమె తెలిపారు. అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త కంపెనీలకు ట్యాక్స్ ను 15 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. దీంతో, కొత్త కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ 17.01 శాతంగా ఉండబోతోంది.