Andhra Pradesh: చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్నా ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయాలి!: ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్
- ఈరోజు చంద్రబాబు నివాసానికి నోటీసులు
- టీడీపీ అధినేత తీరుపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం
- చంద్రబాబుకు సురక్షితమైన ఇల్లు ఇస్తామని హామీ
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలో ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు ఈరోజు రెండోసారి నోటీసులు అంటించిన సంగతి తెలిసిందే. ఇది అక్రమ కట్టడమనీ, నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ నిర్మించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) టీడీపీ అధినేతపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్నా ఈసారి ఇచ్చిన నోటీసులకు స్పందించాలనీ, వెంటనే ఉండవల్లిలోని అక్రమ కట్టడాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు స్పందించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కృష్ణానదికి వరద వస్తే ఉండవల్లిలోని ఇల్లు మునిగిపోతుందనీ, అలాంటి ఇంటిని ఖాళీ చేయడానికి చంద్రబాబుకు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. చట్టాలు ఉల్లంఘించి కోర్టు నుంచి రెండు సార్లు నోటీసులు వచ్చినా చంద్రబాబు స్పందించలేదని ఆర్కే దుయ్యబట్టారు. చంద్రబాబు కోరుకుంటే ప్రభుత్వం సురక్షితమైన ఇంటిని కేటాయిస్తుందని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఇంకా మునిగిపోయే ఉండవల్లి నివాసంలోనే ఉంటానని చెప్పడం సరికాదన్నారు. ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాలని హితవు పలికారు.