Devineni Uma: రూ.157 కోట్ల నష్టం చేసి రూ.58 కోట్లు ఆదా అయిందని బడాయి కబుర్లు చెబుతున్నారు: దేవినేని ఉమ ఫైర్
- ధనయజ్ఞాన్ని పునరావృతం చేశారంటూ ధ్వజం
- సొంతవాళ్లకే పవర్ ప్రాజెక్టు కట్టబెడుతున్నారని ఆరోపణ
- కేసీఆర్ కు రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెడతారంటూ నిలదీసిన ఉమ
ఏపీ సర్కారు పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ లో బిడ్లకు ఆహ్వానం పలకడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ ధనయజ్ఞాన్ని పునరావృతం చేశారని విమర్శించారు. 2005లో పోలవరం ఎడమ కాల్వ సొరంగం టెండర్లు 21 శాతం తక్కువ ధరకు ఇచ్చారని, 65వ ప్యాకేజీ పనులను యూనిటీ ఇన్ ఫ్రా సంస్థకు రూ.115 కోట్లకు ఇచ్చారని వెల్లడించారు. 15 శాతం మట్టిపనులు చేసిన ఆ సంస్థ మధ్యలోనే వెళ్లిపోయిందని అన్నారు. దాని పర్యవసానమే 14 ఏళ్లపాటు పనులు నిలిచిపోయాయని దేవినేని ఉమ ఆరోపించారు.
తాజాగా దానినే రూ.274 కోట్లకు టెండర్లు పిలిచారని, మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ రూ.290 కోట్లకు దక్కించుకుందని, దానినే రివర్స్ చేసి రూ.232 కోట్లకు మళ్లీ మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థకే అప్పగించారని వివరించారు.రూ.157 కోట్లు నష్టం చేసి రూ.58 కోట్లు ఆదా అయ్యాయని బడాయి కబుర్లు చెబుతున్నారని ఉమ మండిపడ్డారు. వైఎస్ అవినీతి వల్ల రూ.115 కోట్ల పని దాదాపు రూ.157 కోట్లకు పెరిగిందని, పెరిగిన రూ.157 కోట్లకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
పోలవరంలో పవర్ ప్రాజెక్టులను సొంతవారికి కట్టబెట్టేందుకు కుట్రకు పాల్పడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. పవర్ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రూ.1000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. టర్బైన్ పనుల్లో అనుభవం ఉన్నవాళ్లను పక్కనబెట్టి పైప్ లైన్ పనుల్లో అనుభవం ఉన్నవాళ్లకు పవర్ ప్రాజెక్టు అప్పగిస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ ఏ అధికారంతో ఒప్పుకున్నారో చెప్పాలని, రాష్ట్రాన్ని కేసీఆర్ కు ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించారు.