Godavari: గోదారమ్మ మైల పడిందట... వెలివేసిన కచ్చులూరు దిగువ గ్రామాలు!
- ఇటీవల నదిలో బోటు ప్రమాదం
- చివరి మృతదేహం వెలికి తీసిన తరువాత పూజలు
- ఆపైనే నీటిని వాడుతామంటున్న గిరిజనులు
గోదావరి నదిలో బోటు మునిగిపోయిన తరువాత నదీమతల్లి మైలపడిందని, చివరి మృతదేహాన్ని వెలికితీసేంత వరకూ ఆ నీటిని వాడేది లేదని కచ్చులూరు దిగువ ప్రాంతాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు జీవనదిగా ఉన్న గోదావరిని, ఈ ప్రాంత ప్రజలు నిత్యమూ తల్లిగా, దేవతగా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. జూన్ తొలివారంలో కాలువలకు నీటిని విడుదల చేసే వేళ, కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేస్తారు కూడా.
ఇటీవల దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి మునిగిపోగా, ఇప్పటికింకా అన్ని మృతదేహాలనూ వెలికితీయలేదన్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరి నీటిని వాడేందుకు పరీవాహక గిరిజన గ్రామాలు ఇష్టపడటంలేదు. మొత్తం 10 నుంచి 12 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాస్తంత దూరమైనా, బోర్లు, కొండలపై నుంచి వచ్చే జల కాలువల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.
మృతదేహాలన్నీ బయటకు వచ్చాక, నదీమతల్లిని శుద్ధి చేసిన తరువాతనే నీటిని వాడుకుంటామని గిరిజనులు భీష్మించుకు కూర్చున్నారు. కాగా, గత సంవత్సరం మే 15న మంటూరు వద్ద ప్రమాదం జరిగిన సమయంలోనూ, వీరు ఇదేరకంగా గోదావరిని దూరం పెట్టిన సంగతి తెలిసిందే.