KCR: ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మేం క్లియర్...కేంద్రానిదే ఆలస్యం : సీఎం కేసీఆర్
- మా వైఖరిలో తేడా లేదు
- అసెంబ్లీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
- అవసరమైతే మరోసారి తీర్మానం
ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పులేదని, కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో కేంద్రమే నాన్చుతోందన్నారు. అవసరమైతే అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయడానికి కూడా మా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇక, విపక్ష కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ప్రమాదం వెంటాడుతున్నది టీఆర్ఎస్ను కాదని, కాంగ్రెస్నని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 21 నుంచి 9కి పడిపోతే బీజేపీ బలం 5 నుంచి ఒకటికి పరిమితమయ్యిందన్నారు. అటువంటప్పుడు ఎవరికి ప్రమాదమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అడ్డగోలుగా మాట్లాడుతోందని, రాష్ట్ర అభివృద్ధికోసమే అప్పు చేశామని, అవసరమైతే ఇంకా చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి తమ ప్రభుత్వం సత్తా ఏమిటో చాటామన్నారు.