Jammu And Kashmir: గృహ నిర్బంధంలో ఉన్న కశ్మీర్ నేతలకు హాలీవుడ్ సినిమాలు చూపిస్తున్నారట!
- 18 నెలలకు మించి వారిని నిర్బంధించబోం
- వారున్నది నిర్బంధంలో కాదు.. అతిథులుగా
- కేంద్రమంత్రి జితేంద్రసింగ్
జమ్మూకశ్మీర్లో గృహ నిర్బంధంలో ఉన్న నేతలను 18 నెలలకు మించి నిర్బంధంలో ఉంచబోమని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ స్పష్టం చేశారు. వారిని వీఐపీ బంగ్లాల్లో ఉంచామని, హాలీవుడ్ సినిమాలు కూడా చూపిస్తున్నామని పేర్కొన్నారు. వారిని తాము అరెస్ట్ చేయలేదని పేర్కొన్న మంత్రి అతిథులుగానే చూస్తున్నట్టు చెప్పారు. జిమ్ సౌకర్యంతోపాటు చూసేందుకు హాలీవుడ్ సినిమాల సీడీలను కూడా ఇస్తున్నట్టు తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదేనని, జమ్మూకశ్మీర్ సరిహద్దులను పునరుద్ధరించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై 1994లో పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ఆమోదించామని గుర్తు చేశారు.
జమ్ముూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎటువంటి అలజడులు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీ, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వంటి వారిని గృహ నిర్బంధంలోకి తీసుకుంది. వీరంతా ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. వీరి నిర్బంధం విషయమై తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.