TTD: బాధ్యతలు స్వీకరించిన టీటీడీ పాలకమండలి సభ్యులు
- ఇటీవల కొత్త పాలకవర్గాన్ని ప్రకటించిన జగన్ ప్రభుత్వం
- కుటుంబాలతో తిరుమల చేరుకున్న సభ్యులు
- ఆలయంలో అట్టహాసంగా కార్యక్రమం
ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇటీవల నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల్లో మరో 20 మంది సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 29 మంది సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులను టీటీడీ పాలకమండలికి నియమించిన విషయం తెలిసిందే. తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ సభ్యులతో ప్రమాణం చేయించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న సభ్యులు అనంతరం అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్వామివారి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. రామేశ్వరరావు, మురళీకృష్ణ, సుబ్బారావు, పార్థసారధి, రమణమూర్తిరాజు, శ్రీనివాసన్, ఎక్స్అఫిషియో సభ్యుడు మన్మోహన్సింగ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు.
అనంతరం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య భవనంలో పాలక మండలి తొలి సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తొలి సమావేశంలో చర్చించేందుకు దాదాపు 175 అంశాలతో అజెండా రూపొందించినట్లు సమాచారం. సీసీ కెమెరాల ఏర్పాటు, అర్చకుల పదవీ విరమణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.