Rishabh Pant: నాలుగో స్థానంలో ఎలా ఆడాలో పంత్ కు తెలియడంలేదు: వీవీఎస్ లక్ష్మణ్
- ఇటీవల వరుసగా విఫలమవుతున్న పంత్
- కోచ్ రవిశాస్త్రి అసంతృప్తితో ఉన్నట్టు కథనాలు
- పంత్ కు ఐదు, ఆరు స్థానాలైతే సరిపోతాయంటున్న లక్ష్మణ్
ధాటిగా ఆడతాడని పేరున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ తో అందరినీ నిరాశకు గురిచేస్తున్నాడు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి సైతం పంత్ ఆటతీరు పట్ల సదభిప్రాయంతో లేడన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడే తత్వం ఉన్న ఆటగాడని, కానీ అంతర్జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఎలా ఆడాలో అతడికి తెలియడం లేదని వివరించారు. అతడి ఆటతీరుకు ఐదు, ఆరు స్థానాలైతే అతికినట్టుగా సరిపోతాయని, వేగంగా ఆడేందుకు ఆ స్థానాలే అనువైనవని తెలిపారు.
నాలుగో స్థానంలో బరిలో దిగే ఆటగాడు కొన్ని పరిమితులకు లోబడి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని, కానీ పంత్ స్వేచ్ఛగా షాట్లు కొట్టే ఆటగాడు కావడంతో సర్దుకుపోలేకపోతున్నాడని విశ్లేషించారు. పైగా ధోనీ స్థానంలో జట్టులోకి ఎంపిక కావడంతో పంత్ పై అపారమైన ఒత్తిడి నెలకొందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దశ ప్రతి ఆటగాడి కెరీర్ లో ఉంటుందని, జట్టు మేనేజ్ మెంట్ ఇలాంటి సమయాల్లోనే ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని సూచించారు.