Donald Trump: పాకిస్థాన్ ను నమ్ముతున్నా: ట్రంప్
- కశ్మీర్ లో ప్రతి ఒక్కరు సమానంగా బతకడాన్ని చూడాలనుకుంటున్నా
- మోదీ, ఇమ్రాన్ లతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి
- కశ్మీర్ సమస్యను పరిష్కరించే సత్తా నాకు ఉంది
ప్రధాని మోదీతో వేదికను పంచుకున్న గంటల వ్యవధిలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే సత్తా తనకు ఉందని, మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని మరోసారి వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ తో భేటీకి ముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ, 'నేను పాకిస్థాన్ ను నమ్ముతున్నా. కశ్మీర్ లో ప్రతి ఒక్కరు సమానంగా బతకడాన్ని చూడాలనుకుంటున్నా. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ ఒప్పుకుంటే సమస్యను పరిష్కరిస్తా. ఈ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా' అని తెలిపారు.