Imran Khan: ట్రంప్ ప్రశ్నతో ఎర్రబారిన ఇమ్రాన్ ఖాన్ ముఖం!
- ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా భేటీ అయిన ట్రంప్, ఖాన్
- కశ్మీర్ పై ట్రంప్ ను పదేపదే ప్రశ్నించిన పాక్ జర్నలిస్ట్
- ఇలాంటివారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ ఇమ్రాన్ కు ట్రంప్ ప్రశ్న
న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రశ్నలకు ఇమ్రాన్ ముఖం వాడిపోయింది. అసలేం జరిగిందంటే... ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై ఓ పాకిస్థాన్ పాత్రికేయుడు ట్రంప్ ను పదేపదే ప్రశ్నించాడు. కశ్మీర్ అంశంపై ట్రంప్ వైఖరిని తెలుసుకునేందుకు యత్నించాడు.
సదరు జర్నలిస్ట్ వైఖరితో విసిగిపోయిన ట్రంప్... 'నీవు ఆయన (ఇమ్రాన్ ఖాన్) టీమ్ కు చెందిన వ్యక్తివా?' అని ప్రశ్నించారు. ఇంతటితో ట్రంప్ ఆగిపోలేదు. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ అవాక్కయ్యారు. ఆయన ముఖం ఎర్రబారింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... అప్పటిదాకా ఈ సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేసిన ఓ పాకిస్థాన్ ఛానల్... ట్రంప్ వ్యాఖ్యలతో వెంటనే లైవ్ కట్ చేసింది.