Telangana: యాదాద్రిలో ‘హరే రామ హరే కృష్ణ’ ఆశ్రమం నేలమట్టం.. భారీ భద్రత మధ్య కూల్చేసిన అధికారులు
- యాదాద్రి చుట్టూ ఆరు లేన్ల రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం
- అడ్డంగా ఉన్న హరే రామ హరే కృష్ణ ఆశ్రమం
- నోటీసులు ఇచ్చినా స్పందించని ఆశ్రమ నిర్వాహకులు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న ఆరులేన్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న హరే రామ హరే కృష్ణ ఆశ్రమాన్ని అధికారులు నిన్న కూల్చేశారు. భారీ భద్రత మధ్య జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. రోడ్డు నిర్మాణానికి ఆశ్రమం అడ్డంగా ఉండడంతో ప్రభుత్వం ఈ ఆశ్రమానికి చట్టప్రకారం కోటిన్నర రూపాయలను నష్టపరిహారంగా డిపాజిట్ చేసింది. అయినప్పటికీ సంబంధిత వ్యక్తులు ఎవరూ స్పందించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆశ్రమాన్ని కూల్చక తప్పలేదని ఆర్డీవో తెలిపారు.
ఆశ్రమ కూల్చివేతను అడ్డుకునేందుకు బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూ ధార్మిక సంస్థలు వస్తాయని భావించిన పోలీసులు ముందస్తుగా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం దానిని కూల్చివేశారు. కూల్చివేత సమయంలో లభించిన కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామగ్రిని యాదాద్రి దేవస్థానానికి తరలించినట్టు ఆర్డీవో పేర్కొన్నారు.